Ticker

6/recent/ticker-posts

ధ్వని-ముఖ్యాంశాలు | AP DSC 2024 _ SA Physics and SGT



ధ్వని-ముఖ్యాంశాలు

• ఒక వస్తువు మధ్యమ స్థానానికి రెండు వైపులా ముందుకు మరియు వెనుకకు కదలడాన్ని 'కంపనం" అని అంటారు.

• కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.

• వీణ, తబలా, సితార్, మంజీర, ఘటం, వేణువు, మృదంగం, హార్మోనియం మొదలైనవి సంగీత వాయిద్యాలకు ఉదాహరణలు.

• మానవులలో వాయిస్ బాక్స్ లేదా స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి చేయబడుతుంది.

• మన గొంతులో మింగేటప్పుడు కదులుతున్నట్లు అనిపించే భాగాన్ని 'స్వరపేటిక' అని అంటారు.

• స్వరపేటిక వాయునాళం పై భాగంలో ఉంటుంది.

• రెండు స్వరతంత్రులు స్వరపేటిక వెంబడి సాగదీయబడి ఉంటాయి.

• స్వరతంత్రులలో గాలి ప్రవహించడానికి వాటిమధ్య ఒక సన్నని చీలిక ఏర్పడి ధ్వని ఉత్పత్తి అవుతుంది.

• పురుషుల్లో స్వరతంత్రులు సుమారు 20మి. మీ పొడవు ఉంటాయి. మహిళల్లో ఇవి సుమారు 15మి.మీ పొడవు ఉంటాయి. పిల్లలకు చాలా చిన్న స్వరతంత్రులు ఉంటాయి.

• నిర్దిష్ట క్రమం మరియు పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ధ్వనుల కారణంగా భాష ఏర్పడింది.

• ధ్వని ప్రయాణించడానికి ఒక మాధ్యమం అవసరం.

• శూన్యం గుండా ధ్వని ప్రయాణించదు.

• ధ్వని ఘనపదార్థాలు, ద్రవాలు మరియు వాయువుల ద్వారా ప్రయాణించగలదు.

• కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని ఒక యానకంలో అన్ని దిశల్లో తీసుకెళ్లబడుతుంది.

• చెవి బయటి భాగం ఆకారం గరాటు లాగా ఉంటుంది.

• చెవిలో కర్ణభేరి అని పిలువబడే పలుచని సాగదీసిన పొర ఉంటుంది.

• చెవిలో చేరిన ధ్వని తరంగాలకు కర్ణభేరి కంపిస్తుంది.

• ఒక సెకనులో చేసిన కంపనాల సంఖ్యను 'పౌనఃపున్యం' అని అంటారు.

• పౌనఃపున్యం హెర్ట్జ్ (Hz)లో వ్యక్తీకరించబడుతుంది. 1Hz పౌనఃపున్యం అనేది సెకనుకు ఒక కంపనం (డోలనం).

• కంపనపరిమితి మరియు పౌనఃపున్యం అనేవి ధ్వని యొక్క రెండు ముఖ్యమైన ధర్మాలు.

• ధ్వని తీవ్రత అనేది ధ్వనిని ఉత్పత్తి చేసే కంపనం యొక్క కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

• ధ్వని తీవ్రతను డెసిబెల్ (dB) లో కొలుస్తారు.

• కంపనం యొక్క కంపన పరిమితిఎక్కువగా ఉన్నప్పుడు, ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది.

• ధ్వని యెక్క కీచుదనాన్ని పిచ్ అంటారు.

• ధ్వని కీచుదనం పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.

• ఒకవేళ కంపనం యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉన్నట్లయితే, ధ్వని అధిక పిచ్ని కలిగి ఉంటుంది.

• ఒక స్త్రీ యొక్క స్వరం పురుషుడి స్వరం కంటే ఎక్కువ పిచ్ని (పౌనఃపున్యాన్ని) కలిగి ఉంటుంది.

ధ్వని                                      తీవ్రత.    
నిశ్శబ్దానికి సమీప ధ్వని.           0 డిబి

గుసగుస.                                15 డిబి

సాధారణ సంభాషణ.                 60 డిబి

లాన్ యంత్ర శబ్దం.                     90 డిబి

కారు హారన్.                            110 డిబి

జెట్ ఇంజన్ శబ్దం.                   120 డిబి

తుపాకి పేలుడు లేదా
టపాకాయ పేలుడు శబ్దం.         140 డిబి

• మానవునిలో ధ్వనులను ఉత్పత్తి చేయడంలో పాల్గొనే అవయవాలు: 1. స్వర తంత్రులు 2. పెదవులు 3. దంతాలు మరియు నాలుక 4. ముక్కు మరియు గొంతు

• మానవ శ్రవ్యఅవధి సుమారుగా 20Hz నుండి 20,000Hz వరకు ఉంటుంది.

• చెవికి ఆహ్లాదాన్ని కలిగించే ధ్వనులను 'సంగీతం' అంటారు.

• వినడానికి ఆహ్లాదకరంగాలేని ధ్వనులను 'కఠోరధ్వనులు' అని అంటారు.

• వాతావరణంలో అధిక శబ్దతీవ్రత గల లేదా అవాంఛిత ధ్వనులు ఉండటాన్ని 'ధ్వని కాలుష్యం' అంటారు.

• ధ్వని కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాల శబ్దాలు, టపాసులు పేలడం, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు, విస్ఫోటనాలు మొదలైనవి.

• అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి, ఉద్రేకపడటం మరియు వినికిడి లోపించడంవంటి ఆరోగ్య రుగ్మతలు ధ్వని కాలుష్యం వల్ల సంభవించవచ్చు.

మొక్కలు నాటడం, వాహనాలకు సైలెన్సర్ లు అమర్చడం, కర్మాగారాలను నివాసాలకు దూరంగా ఏర్పరచడం, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని తగ్గించడం మొదలైనవి చేయడం వల్ల ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

• మొట్టమొదటిగా న్యూటన్ గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.

• శ్రుతిదండాన్ని రబ్బరు సుత్తితో కొట్టడం ద్వారా మనం ధ్వని ఉత్పత్తి చేయవచ్చు.

• శ్రుతిదండం ఒక శబ్ద అనునాదం,

• ప్రతి శ్రుతి దండానికి ఒక నిర్దిష్ట పిచ్ ఉంటుంది.

• సంగీత వాయిద్యాలను శ్రుతి చేయడానికి శ్రుతిదండాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.

• శ్రుతి దండాన్ని క్రీస్తుశకం 1711 సంవత్సరంలో సంగీత విద్వాంసుడు జాన్ షోర్ కనుగొన్నారు.

• ధ్వని ప్రసారం జరిగే మాధ్యమాన్ని 'యానకం' అంటారు.

• యానకంలో ఏర్పడే అలజడి ధ్వని జనకానికి దగ్గరగా ఉన్నచోట సంపీడన రూపంలో ఉంటుంది.

• సంపీడనాల వద్ద గాలి సాంద్రత ఎక్కువగాను, విరళీకరణాల వద్ద గాలి సాంద్రత తక్కువగాను ఉంటుంది.

• గాలిలో ధ్వని ప్రసారం సంపీడనాలు మరియు విరళీకరణాల ద్వారా జరుగుతుంది.

• ధ్వని తరంగంలో సంపీడనాలు మరియు విరళీకరణాలు ఒకే దిశలో ప్రయాణిస్తాయి.

• సంపీడనాలు మరియు విరళీకరణాలను వివరించడానికి 'రిపిల్ టాంక్'ను ఉపయోగించవచ్చు.

• యానకంలో కణాల చలనం తరంగ చలన దిశలోనే కంపిస్తే ఆ తరంగాలను 'అనుదైర్ఘ్య తరంగాలు' అని అంటారు.

• యానకంలో కణాల చలనం తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను 'తిర్యక్ తరంగాలు' అని అంటారు.

• అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతల్లో మార్పులకు కారణం అవుతాయి. కానీ తిర్యక్ తరంగాలు ఆకృతిలో మార్పుకు కారణం అవుతాయి.

• గాలిలో ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్పవచ్చు.

• తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి, పౌనఃపున్యం, తరంగ వేగం, వీటిని 'తరంగ లక్షణాలు' అని అంటారు.

• స్థిర ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం సాంద్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

• 'శృంగాలు' అంటే సాధారణ స్థాయి కంటే అధిక సాంద్రత మరియు అధికపీడనం కలిగిన ప్రదేశాలు. 'ద్రోణులు' అంటే అల్పపీడనం కలిగిన ప్రదేశాలు అని అర్ధం.

• సాంద్రత మరియు స్థానాల గ్రాఫ్ లో ఎత్తైన ప్రాంతాన్ని 'శృంగం' అని, లోతైన ప్రాంతాన్ని 'ద్రోణి' అని అంటారు.

• ధ్వని తరంగంలో రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ఆ తరంగం యొక్క 'తరంగదైర్ఘ్యం' అంటారు. (లేదా) సాంద్రత స్థానం గ్రావ్లో రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని 'తరంగదైర్ఘ్యం' అంటారు.

• తరంగదైర్ఘ్యాన్ని మీటర్లలో కొలుస్తారు.

• గాలిలో ప్రయాణించే ధ్వని తరంగం కంపన పరిమితిని సాంద్రతలో కలిగే అత్యధిక వ్యత్యాసంగా గాని, గాలి పొరల కదలిక అత్యధిక దూరంగా గాని చెప్పవచ్చు.

• గాలిలో కంపన పరిమితి ప్రమాణాలను సాంద్రత మరియు పీడనాల ఆధారంగా లెక్కిస్తారు.

• ఘనపదార్థాలలో కంపన పరిమితిని స్థానభ్రంశం ఆధారంగా లెక్కిస్తారు.

• ధ్వని ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానక సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ఠ విలువ వరకు మారుతూ ఉంటుంది.

• ధ్వని ప్రసారంలో యానక సాంద్రత ఒక పూర్తి డోలనం చేయటానికి పట్టిన కాలాన్ని ధ్వని తరంగం 'ఆవర్తన కాలం' అంటారు.

• ఒక తరంగంపై గల ఏదైనా ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని 'తరంగ వేగం'

అంటారు. ధ్వని వేగం తరంగ పౌనఃపున్యం మరియు తరంగదైర్ఘ్యాల లబ్ధానికి సమానం.

• ధ్వని వేగం అది ప్రయాణించే యానక స్వభావం, ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది.

• ఒక నిర్దిష్ట యానకంలో ఒకేరకమైన భౌతిక స్థితులలో విభిన్న పౌనఃపున్యం గల ధ్వని వేగం దాదాపు స్థిరంగా ఉంటుంది.

• 20 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగానికి సుమారు 4.73 రెట్లు అధికం.

• ఒక జనకం ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని 0.1 సెకన్ల కంటే తక్కువ సమయంలో పరావర్తనం చెందినట్లయితే, ప్రతినాదం వినబడుతుంది.

• ఒక జనకం ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని 0.1 సెకన్ల కంటే ఎక్కువ సమయంలో పరావర్తనం చెందినట్లయితే, ప్రతిధ్వని వినబడుతుంది.


• 20Hz కంటే తక్కువ పౌనఃపున్యం గల శబ్దాలను పరశ్రావ్యాలు గాను, 20kHz కంటే ఎక్కువ పౌనఃపున్యం గల శబ్దాలను అతిధ్వనులుగాను పరిగణిస్తారు.

• అతిధ్వనులను ప్రధానంగా వైద్యరంగంలో వినియోగిస్తున్నారు.

• అతిధ్వనులను లోహాలలోని పగుళ్ళను గుర్తించడానికి, శరీర అంతర్గత అవయవాలను చిత్రీకరించడానికి ఉపయోగిస్తారు.

• సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.

• నీటి లోపల మునిగి ఉండే వస్తువులను గుర్తించడానికి సోనార్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

• సముద్రాల లోతు, సముద్రాలలోని వర్వతాలను కనుగొనడానికి ఈకోరేంజింగ్ పద్ధతి వాడతారు.