*జాతీయానికి సామెతకు గల భేదం ఏమిటి?*
సామెత అనేది సామ్యత నుండి వచ్చింది. దీనికి అర్థం. పోలిక చెప్పునది. సామెత వాక్యం రూపంలో ఉంటుంది.
జాతీయాలు వాటికి గల అర్థాన్ని మరుగున పరిచి విశిష్టార్థంలో ప్రయోగింపబడతాయి. రెండు పదాలు కలిసి విలక్షణ అర్థం ఇస్తాయి. ఇతర భాషలలోకి అనువదించడానికి వీలు కానివి. ఒక మాటలో చెప్పాలంటే నిగూఢార్థ ప్రయోగం.
జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.
కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట./ కాకిపిల్ల కాకికి ముద్దు. / తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా... ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయములో అర్థం అసంపూర్ణం. సగము వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ:..కడతేర్చాడు / [[కడుపు మంట. / కన్నాకు./ అగ్గినిప్పు./ పంటపండింది. పంటికిందరాయి./పక్కలోబల్లెం ఇలా వుంటాయి. పైగా వాటి నిజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు.... పంట పండించి. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము. పప్పులో కాలేశాడు. అనగా పప్పులో నిజంగా కాలు వేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు.... చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు. అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు.
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట")