అమరావతి: ఈ ఏడాది నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలని ఇది వరకే నిర్ణయించామనీ, ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుక వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై ఆయన ఆరా తీశారు. 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదించగా.. ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు. ఎయిడెడ్ స్కూళ్లను విలీనం చేయాలని బలవంతం చేయట్లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. స్కూళ్ల అప్పగింత అనేది స్వచ్ఛందమనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. ఎయిడెడ్ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే పాఠశాలలను నడుపుతుందని తెలిపారు.