Ticker

6/recent/ticker-posts

టుడే న్యూస్ (02/10/2020)

 

టుడే న్యూస్

(02/10/2020)


👉 భారత్​ను ప్రత్యక్షంగా ఎదుర్కోకోలేక సామాజిక మాధ్యమాల వేదికగా సైన్యంలో విభేదాలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని భారత ఆర్మీ ఆరోపించింది. కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని తెలిపింది. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.


👉 ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించిన 33 ఏళ్ల రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ 187 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా ఉన్నారు.


👉 కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. అమృత్‌సర్‌లో పుట్టిన బగాయ్‌కు 11వ యేటానే వివాహమైంది. దాంతో 1915లో ఆమె తన భర్త వైష్ణో దాస్ బగాయ్‌తో కలిసి అమెరికా వెళ్లారు.అమెరికాలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టడం విశేషం. భారత్ నుంచి 1915లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయురాలు కలా బగాయ్‌కు మరణానంతరం ఈ అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలోని ఓ వీధికి తాజాగా ఆమె పేరు పెట్టారు. అక్కడికి వెళ్లిన తొలినాళ్లలో బగాయ్‌ తీవ్ర జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. పొరుగువారి జాత్యహంకారంతో తన కొత్త ఇంటిని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. అయినా భయపడకుండా ఆమె అక్కడే ఉండి వాటిని తిప్పికొట్టారు. బగాయ్ పట్టుదలకు గుర్తింపుగా తాజాగా ఆమెకు ఈ గౌరవం దక్కింది.  


👉 ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బంది బతుకులను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఉన్నత చదువులు అభ్యసించినా సర్కారు కొలువుల కోసం ఎదురుచూడకుండా ప్రైవేటు సంస్థల్లో పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వారిని రోడ్డున పడేసింది. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో ఐదారు నెలలుగా  వేతనాలు  లేవు. దీంతో ఉపాధ్యాయులు కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటున్నారు.


👉 కంబోడియాలో భారత రాయబారిగా దేవయాని ఉత్తం ఖోబ్రగడే నియమితులయ్యారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఆమె నియామకాన్ని ధ్రువీకరించింది. 1999 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) కు చెందిన దేవయాని.. ప్రస్తుతం ఢిల్లీలోని విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. దాదాపు 21 సంవత్సరాల కెరీర్‌లో దేవయాని.. బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ మిషన్లలో పనిచేశారు.తన ఇంట్లోని భారతీయ పనిమనిషికి అండర్ పేయింగ్ ఆరోపణలపై న్యూయార్క్‌లోని అధికారులు దేవయాని ఖోబ్రగడేపై చర్య తీసుకోవడంతో 2013 లో ఆమె వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్‌లోని ఇండియన్‌ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. 


👉 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు స్వీయ నిర్బంధంలోకి ఉండాలి’ అని సూచించారు.


👉 వీధి నుంచి నడుచుకుని వెళ్తున్న ఓ వృద్ధురాలిపై ఎద్దు దాడి చేసింది. ఒక్కసారే ఎత్తిపడేసింది. ఆమె అరుపులు విన్న మనవడు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడిని కూడా ఎద్దు ఎత్తిపడేసింది. అయితే, అతడు ఏ మాత్రం భయపడలేదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఆమెను పట్టుకున్నాడు. దీంతో ఆ ఎద్దు మళ్లీ వారిని కుమ్మేసింది. దీంతో ఇద్దరు కిందపడిపోయారు. ఇంతలో స్థానికులు కర్రలు పట్టుకుని వచ్చి వారిద్దరినీ రక్షించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన హర్యానాలోని మహేంద్రగడ్‌లో చోటుచేసుకుంది.


👉 కొవిడ్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావడం సాధారణమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా 80ఏళ్ల వయసు పైబడినవారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కొవిడ్‌ సోకిన వృద్ధుల్లో ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వయోవృద్ధుల్లో గుండెపోటు రావడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.