జవాబు:
మానవుడిలో 23 జతల క్రోమోజోములున్నాయి. ప్రతి క్రోమోజోములో డీఎన్‌ఏ పేలికలుంటాయి. ప్రతి డీఎన్‌ఏ పేలికలో న్యూక్లియోటైడులనే విడివిడి రసాయనిక భాగాలు దండలో పూసల్లా ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడు పూసలో ఓ నత్రజని క్షారం, ఓ చక్కెర ధాతువు, ఓ ఫాస్ఫేటు సంధానం ఉంటాయి.
చక్కెర ధాతువు, ఫాస్ఫేటు భాగం ప్రతి న్యూక్లియోటైడులో ఒకే విధంగా ఉన్నా నత్రజని క్షారాల వరస క్రమం ఒకే విధంగా ఉండదు. చాలామటుకు సామ్యంగానే ఉన్నా అక్కడక్కడా తేడాలుంటాయి. ఈ తేడాలున్న భాగాలే మనుషుల్లో వ్యత్యాసాలకు ప్రధాన కారణమవుతాయి. సాధారణ వరుస క్రమం మనిషిలో సాధారణ విషయాల్ని (తల, ఆకలి, హార్మోన్లు, అవయవాలు మొదలయిన స్థూల రూపాల్ని) నిర్దేశించగా విశిష్టతను ఈ తేడా భాగాలే నిర్దేశిస్తాయి.
ఇలా విడివిడి జీవుల్లో విడివిడి వరుస క్రమాలు, డీఎన్‌ఏ పేలికల సంఖ్యలుంటాయి. వీటినే జన్యువులు అంటారు. మనుషుల్లో అక్కడక్కడ జన్యువుల్లో తేడాలుండడం వల్లే రూపురేఖల్లో తేడా!